KTR: పీవీ విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిదిద్దాలి: కేటీఆర్
- భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ అని కేటీఆర్ కితాబు
- మన్మోహన్ సింగ్‌తో కలిసి గాడిన పెట్టేందుకు కృషి చేశారన్న మాజీ మంత్రి
- పీవీకి భారతరత్న ఇవ్వాలన్న కేటీఆర్
తెలుగువారికి... తెలంగాణవారికి... అలాగే భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నరసింహారావు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... నాడు అప్పుల్లో కూరుకుపోయిన భారత్‌ను... మన్మోహన్ సింగ్‌తో కలిసి గాడిన పెట్టేందుకు ఆయన కృషి చేశారన్నారు. దేశానికి తనవంతుగా సేవలు అందించారని కొనియాడారు. అలాంటి పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేటీఆర్ అన్నారు. పీవీ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం డిమాండ్ చేశామో ఇప్పుడూ అదే అడుగుతున్నట్లు చెప్పారు.
పీవీ ఘాట్ వద్ద ఈటల నివాళి
పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ... దేశం ఆర్థికంగా కుంగిపోయిన సమయంలో పీవీ సంస్కరణలు దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టినట్లు చెప్పారు. పీవీని కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని విమర్శించారు. పీవీకి సముచిత స్థానం ఇవ్వలేదని కేసీఆర్ చెబుతున్నారని, కానీ కనీసం ఆయన వర్ధంతి సభకు బీఆర్ఎస్ నుంచి ఎవరూ రాకపోవడం దారుణమన్నారు.