Konda Surekha: గత ప్రభుత్వ నేతల ఆస్తులపై కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుండేది!: మంత్రి కొండా సురేఖ
- బీఆర్ఎస్ నేతల ఆస్తులు ఎంత? అని శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుండేదన్న సురేఖ
- దేవాదాయ శాఖ భూముల కబ్జాపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
- సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నేతల ఆస్తులపై కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాకముందు ఆ నేతల ఆస్తులు ఎంత? అధికారంలోకి వచ్చిన పదేళ్ల తర్వాత వారి ఆస్తులు ఎంత? అనే వివరాలతో శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందన్నారు. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆమె వరంగల్లోని బట్టలబజార్ శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
వరంగల్ తూర్పు నుంచి ఓటు వేసి తనను గెలిపించిన ప్రజలందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. దేవాదాయ శాఖ భూముల కబ్జాపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై ప్రతిపక్షం వివాదం చేయడం సరికాదన్నారు. అందుకే బీఆర్ఎస్ నేతల ఆస్తులపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాల్సిందని అన్నారు.