India: మహిళల టెస్టు క్రికెట్లో తొలిసారి ఆస్ట్రేలియాను ఓడించిన భారత్
- ముంబయిలో టెస్టు మ్యాచ్
- 8 వికెట్ల తేడాతో ఆసీస్ పై భారత్ ఘనవిజయం
- 75 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లకు ఛేదించిన భారత్ మహిళల జట్టు
- ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన హర్మన్ ప్రీత్ సేన
హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మహిళల టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియాపై భారత్ కు ఇదే తొలి విజయం కావడం విశేషం. 1977 నుంచి భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య 10 టెస్టులు జరగ్గా... అందులో 4 మ్యాచ్ ల్లో ఓడిపోయిన భారత్ 6 టెస్టులను డ్రా చేసుకుంది. ఇప్పుడీ 11వ మ్యాచ్ లో టీమిండియా చిరస్మరణీయ విజయం నమోదు చేసుకుంది.
ముంబయిలో జరిగిన ఈ టెస్టులో ఆస్ట్రేలియా మొదట ఇన్నింగ్స్ లో 219 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4, స్నేహ్ రాణా 3, దీప్తి శర్మ 2 వికెట్లతో సత్తా చాటారు.
అనంతరం టీమిండియా మహిళలు తమ తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ (40), స్మృతి మంథన (74) తొలి వికెట్ కు 90 పరుగులు జోడించి శుభారంభం అందించగా... రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73, దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులతో దంచికొట్టారు. దాంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 406 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇక, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 261 పరుగులకే కుప్పకూలింది. స్నేహ్ రాణా 4, రాజేశ్వరి గైక్వాడ్ 2, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 2 వికెట్లు తీసి ఆసీస్ పతనంలో కీలకపాత్ర పోషించారు. దాంతో, 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మంథన (38 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (12 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన ఏకైక టెస్టులోనూ భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించడం తెలిసిందే. భారత మహిళల జట్టు 2014 తర్వాత సొంతగడ్డపై మళ్లీ ఇటీవలే టెస్టులు ఆడుతోంది. ఇప్పుడు రెండింటికి రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గడంతో భారత క్రికెట్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.