Kim Denicola: తలనొప్పితో ఆసుపత్రిలో చేరిన మహిళ.. ఒక్కసారిగా 30 ఏళ్ల జ్ఞాపకాలు మాయం!
- అమెరికా మహిళ జీవితంలో ఐదేళ్ల క్రితం వింత ఘటన
- తలనొప్పితో ఆసుపత్రిలో చేరి అన్నీ మర్చిపోయిన వైనం
- ఇప్పటికీ గుర్తుకు రాని జ్ఞాపకాలు, మహిళ సమస్యకు కారణాలు చెప్పలేకపోతున్న వైద్యులు
- కొత్త జ్ఞాపకాలు పోగేసుకోవడంలో బిజీగా ఉన్నానని తాజాగా చెప్పిన మహిళ
అది 2018. అమెరికాకు చెందిన 56 ఏళ్ల ఓ మహిళ తీవ్ర తలనొప్పితో ఆసుపత్రిలో చేరింది. ఆ తరువాత ఎమర్జెన్సీ వార్డులో మహిళకు మెలకువ వచ్చే సరికి జీవితం మొత్తం తలకిందులైపోయింది. అంతకుముందు 30 ఏళ్ల నాటి జ్ఞాపకాలన్నీ ఆమె మర్చిపోయింది. భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, వారి మరణం.. ఇలా జ్ఞాపకాలు అన్నీ తుడిచి పెట్టుకుపోయాయి. తానో టీనేజర్ అనుకుంటూ స్పృహలోకి వచ్చిందా మహిళ. చివరకు విషయం తెలిసి దిమ్మెర పోయింది. లూసియానాకు చెందిన కిమ్ డెనికోలా ఎదుర్కొన్న పరిస్థితి ఇది.
ఇటీవల క్రిస్మస్ సందర్భంగా అరవై ఏళ్ల ఆ మహిళను మీడియా మళ్లీ పలకరించగా నాటి విషయాలను మరోసారి ఆమె పంచుకుంది. ఎన్నో క్రిస్మస్ వేడుకలు తన స్పృతి పథం నుంచి చెరిగిపోయినా కొత్త జ్ఞాపకాలను పోగేసుకుంటున్నానని కిమ్ తెలిపింది. అప్పట్లో తాను రాసుకున్న డైరీలు చదువుతుంటే వేరే వ్యక్తి జ్ఞాపకాలను చూస్తున్నట్టు అనిపిస్తోందని వెల్లడించింది. అయితే, తనకు బాధ లేదని, దేవుడు ఏదో కారణంతోనే తనకీ పరిస్థితి కల్పించాడని కిమ్ చెప్పుకొచ్చింది. ఆ కారణమేంటో ఏదో రోజు తెలుస్తుందని వ్యాఖ్యానించింది.
కిమ్ ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీసియాతో బాధపడుతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. అయితే, ఆమె మెదడులో అసలు ఏం జరిగిందనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే అనేక పరీక్షలు నిర్వహించినా మిస్టరీ మాత్రం వీడలేదు. ఘటన జరిగి అయిదేళ్లు అవుతున్నా పరిస్థితుల్లో మార్పు లేదంటే ఆమెకు గత జీవితం ఇక ఎన్నడూ గుర్తుకు రాకపోవచ్చని చెబుతున్నారు.