Rajendraprasad: గ్రామ సచివాలయాలను పంచాయతీల్లో విలీనం చేసి, సర్పంచులకు అధికారాలివ్వాలి: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్
- పంచాయతీ నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందన్న రాజేంద్రప్రసాద్
- జనవరి 1వ తేదీ నుంచి సర్పంచుల ఆధ్వర్యంలో సమర శంఖారావాన్ని పూరిస్తున్నామని వెల్లడి
- పంచాయతీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్న రాజేంద్రప్రసాద్
గ్రామ సచివాలయాలను పంచాయతీల్లో విలీనం చేయాలని టీడీపీ నేత, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. సర్పంచ్ లకు పూర్తి అధికారాలను అప్పగించాలని అన్నారు. పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తూ... విద్యుత్తు బకాయిలు, ఇతర ఖర్చులకు సర్దుబాటు చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ... జనవరి 1వ తేదీ నుంచి సర్పంచుల ఆధ్వర్యంలో సమర శంఖారావాన్ని పూరిస్తున్నామని చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులకు రూ. 30 వేలు, ఎంపీటీసీ సభ్యులకు రూ. 15 వేల గౌరవ వేతనాన్ని ఇవ్వాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా 12,918 మంది సర్పంచులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ, పంచాయతీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రూ. 8,629 కోట్ల పంచాయతీ నిధులను దారి మళ్లించిందని మండిపడ్డారు.