sridhar babu: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Bhabu on Lok Sabha election

  • ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులు కాకపోయినా, రెండు హామీలు అమలు చేశామన్న మంత్రి
  • బీఆర్ఎస్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని విమర్శలు
  • కేంద్రంలో బీజేపీని అడ్డుకుంటామన్న మంత్రి శ్రీధర్ బాబు

రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణులు పని చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ నెల 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఈ నేపథ్యంలో అదిలాబాద్‌లో కాంగ్రెస్ ఆవిర్భావ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులు కూడా కాలేదని, కానీ తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండింటిలో కొన్నింటిని అమలు చేశామని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణంలో భాగంగా ఇప్పటి వరకు 4 కోట్ల మందికి జీరో టిక్కెట్లు ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. వికలాంగులకు రూ.6వేల పెన్షన్ త్వరలో ఇస్తామన్నారు.

తాము శ్వేతపత్రం విడుదల చేస్తే కేటీఆర్ స్వేదపత్రం విడుదల చేశారని.. కానీ ఔటర్ రింగ్ రోడ్డును వారే నిర్మించినట్లు ఫొటో పట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. ఔటర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అని, దీనిని బీఆర్ఎస్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్ర ఖజనాకు చెందిన ప్రతి పైసా ప్రజలకు చెందాలి తప్ప నలుగురు కుటుంబ సభ్యులకు కాదని వ్యంగ్యంగా అన్నారు. తాము ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తామని, అలాగే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటామన్నారు. కేంద్రంలో దేశ సంపదను కొల్లగొడుతూ మతతత్వ విధానాలతో ముందుకు వెళ్తున్న బీజేపీని అడ్డుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News