YS Jagan: లేనిపోని అనుమానాలతో నా టికెట్‌నే అమ్మకానికి పెట్టారు: వైసీపీపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
- జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరన్న టీడీపీ నేత
- వైఎస్ రాజేశేఖర్ రెడ్డికి ఉన్న గుణాలేవీ జగన్‌కు రాలేదని వ్యాఖ్య
ఇటీవలే టీడీపీలో చేరిన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ, జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. లేనిపోని అనుమానాలతో తన టికెట్‌నే సీఎం జగన్ అమ్మకానికి పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, ఆయన ఇక జన్మలో సీఎం కాలేరని విమర్శించారు. జగన్‌ను గెలిపించి తప్పు చేశామని మండిపడ్డారు. జగన్ లాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరని, సీఎం పదవి భగవంతుడు ఇచ్చిన వరమని గ్రహించాలని, జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఏపీలో అక్రమ కేసులు, అన్యాయాలను ఇక భరించలేమని వైసీపీ సర్కారుపై ఆయన ధ్వజమెత్తారు.
బటన్లు నొక్కడమే లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎలా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎటుచూసినా అభివృద్ధి కానరావడంలేదని, జగన్ చుట్టూ ఉండేవారు, సలహాదారులు ఎవరికివారే దోచుకుంటుకున్నారని ఆరోపించారు. కడపలో మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ రాజేశేఖర్ రెడ్డికి ఉన్న గుణాలేవీ జగన్‌కు రాలేదని తీవ్రంగా విమర్శించారు. రుషికొండలో భవనాలను సరదాగా కట్టుకున్నట్లు అనిపిస్తోందని, నాయకుడికి తీవ్రమైన ధనదాహం ఉండకూడదని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
టీడీపీకి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆదరణ పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకుంటే ప్రజలు గుండు కొట్టించుకోవాల్సిందేనని ఆయన అన్నారు. ఉదయగిరిలో తాను డబ్బులు తీసుకుంటున్నానంటూ జగన్ అన్నారని, సంపాదించడానికి ఉదయగిరిలో ఏముందని చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అయినా తన గ్రాఫ్ బాగా లేదంటూ సీఎం జగన్ తనను కించపరిచారని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశానని అన్నారు.