Congress: 28వ తేదీ నుంచి తెలంగాణలో 'ప్రజాపాలన'... అధికారులతో దానకిశోర్ సమీక్ష సమావేశం
- ప్రజాపాలన, వార్డు సభల కోసం బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన
- దరఖాస్తుల స్వీకరణ.. రసీదులు ఇవ్వడం డిజిటలైజ్ చేయాలని సూచన
- వార్డు సభల తేదీలను ప్రజల్లోకి వెళ్లే విధంగా చూడాలని ఆదేశం
తెలంగాణలో 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలనలో భాగంగా వార్డు సభలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన సన్నద్ధతపై సీడీఎంఏ హరిచందన, జేడీలు కృష్ణమోహన్ రెడ్డి, శ్రీధర్తో పాటు ఇతర మున్సిపల్ శాఖ కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన, వార్డు సభల కోసం బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ... రసీదులు ఇవ్వడం... ఆ అంశాలను డిజిటలైజ్ చేయడం వంటివి ఉంటాయని, వాటికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డు సభల తేదీలు ప్రజల్లోకి వెళ్లే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యమయ్యేలా చూడాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంపై రోజువారీ నివేదికను రాష్ట్ర కార్యాలయానికి పంపించాలన్నారు.