sandeep sandilya: తెలంగాణలో ఆల్ఫాజోలం డ్రగ్ తలనొప్పిగా మారింది.. కొకైన్ కంటే ప్రమాదకరం: టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య
- ఆల్ఫాజోలం అక్రమంగా తరలిస్తున్నవారిని ఉపేక్షించేది లేదన్న సందీప్ శాండిల్య
- ఇటీవల వరుసగా ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి
- హైదరాబాద్‌లో 66 కేసులు నమోదయ్యాయన్న సందీప్ శాండిల్య
తెలంగాణలో ఆల్ఫాజోలం (మందులలో వాడే ఒకరకమైన మత్తు పదార్ధం) తలనొప్పిగా మారిందని, ఇది మాదకద్రవ్యాల్లోని కొకైన్ కంటే ప్రమాదకరంగా తయారయిందని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. ఆల్ఫాజోలం అక్రమంగా తరలిస్తున్నవారిని ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల 3.14 కోట్ల రూపాయల విలువ చేసే 31.42 కిలోల ఆల్ఫాజోలంను నాగర్ కర్నూలు జిల్లాలో పట్టుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజుల క్రితం జిన్నారంలో 14 కిలోల నార్డజెపమ్ డ్రగ్‌ను పట్టుకున్నట్లు తెలిపారు.
మరో కేసులో సూరారం పరిధిలో నరేందర్ అనే వ్యక్తి నుంచి పది కిలోల ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో కేసులో విధుల నుంచి తొలగించిన ఏఆర్ కానిస్టేబుల్ ఇలాంటి దందాలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఆల్ఫాజోలంకు సంబంధించి 66 కేసులు నమోదయినట్లు తెలిపారు.