America: క్రిస్మస్ వేళ అమెరికాలో విషాదం.. కొలరాడోలోని ఓ షాపింగ్ మాల్‌లో కాల్పులు
- ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
- రెండు గ్రూపుల మధ్య ఘర్షణలో పేలిన తుపాకి
- ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న విషాదకర ఘటన
అగ్రరాజ్యం అమెరికాలో క్రిస్మస్ పండగ వేళ కూడా కాల్పులు జరిగాయి. కొలరాడోలోని ఒక మాల్‌లో ఆదివారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ షాపింగ్ సందడిలో బిజీగా ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణలో భాగంగా ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని, ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పోలీసు అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని, తీవ్రంగా గాయపడిన బాధితులను తక్షణమే హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు.
‘సిటాడెల్ మాల్’ వద్ద ఈ కాల్పుల ఘటన జరిగిందని, ఒక వ్యక్తి చనిపోయినట్లు గుర్తించామని కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పోలీసు అధికారులు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారిలో ఓ మహిళ ఉందని, ఈ కాల్పుల ఘటనతో సంబంధమున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగిందని, ఈ ఘటనలో ఓ యువకుడు చనిపోయినట్టు తెలిపారు. మరోవైపు శనివారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని ఓకాలా వద్ద ఓ మాల్ వద్ద కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా ఒక మహిళ గాయపడినట్లు ఓకాలా పోలీస్ చీఫ్ మైక్ బాల్కెన్ వెల్లడించారు.