Postman: మోహన్ బాబుగారికి నాపై కోపం వచ్చింది: డైరెక్టర్ ముప్పలనేని శివ
- దర్శకుడిగా మంచి పేరున్న ముప్పలనేని శివ
- మోహన్ బాబుతో చేసిన 'పోస్టుమేన్'
- ఆ సమయంలో జరిగిన సంఘటనల ప్రస్తావన
- ఫ్లాప్ అయినా లాభాలు వచ్చాయని వెల్లడి
ముప్పలనేని శివ అనగానే 'తాజ్ మహల్' .. 'రాజా' .. 'అమ్మాయి కోసం' వంటి హిట్స్ గుర్తుకు వస్తాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన మరో సినిమానే 'పోస్టుమేన్'. మోహన్ బాబు సొంత బ్యానర్లో .. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా, 2000 సంవత్సరంలో విడుదలైంది. వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.
తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముప్పలనేని శివ మాట్లాడుతూ .. 'పోస్టు మేన్' సినిమాలో హీరో ఇంటికి సంబంధించి ముందు వైపు మెట్లు అవసరమని నేను చెప్పాను. అవసరం లేదు అని మోహన్ బాబు అన్నారు. ఆ కథకి ఇంటి ముందు వైపు నుంచి మెట్లు ఉండటం తప్పనిసరి కావడం వలన నేను మెట్లు వేయించాను. అందుకు ఆయనకి కోపం వచ్చింది" అని అన్నారు.
"ఇక ఈ సినిమాలో పద్యాలు కూడా ఉన్నాయి. అయితే పద్యాలు వద్దని నేను అన్నాను. కావలసిందేనని ఆయన అన్నారు. ఈ సినిమా ప్రివ్యూకి ఆయన చాలామంది సీనియర్స్ ను పిలిచారు. వాళ్లంతా కూడా పద్యాలు ఉంచమనడంతో, మళ్లీ ఆయన నా అభిప్రాయం అడగకుండా అలా ఉంచేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది .. అయితే డబ్బుల పరంగా లాభాలనే తెచ్చిపెట్టింది" అని చెప్పారు.