dharmapuri arvind: తెలంగాణ కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు: ఎంపీ ధర్మపురి అరవింద్
- కాంగ్రెస్ పార్టీకి మరోసారి శుభాకాంక్షలు తెలిపిన ధర్మపురి అరవింద్
- ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు వేచి చూస్తామని వ్యాఖ్య
- తెలంగాణకు.. ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎంపీ
ఇప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలుకు వారు 100 రోజుల సమయం ఇచ్చారని, ఎలా అమలు చేస్తారో చూడాలన్నారు. గడువులోగా వాటిని అమలు చేసే వరకు వేచి చూస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు కేంద్రం సాయం కోరడం శుభపరిణామం అన్నారు. తెలంగాణకు... రాష్ట్ర ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
రానున్న రోజుల్లో పసుపుకు రూ.20వేలు మద్దతు ధరను ఇప్పిస్తామని చెప్పారు. ఒక ఎంపీగా తాను చేసిన అభివృద్ధి పనుల పట్ల సంతోషంగా ఉన్నట్లు అరవింద్ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 30 శాతం ఓట్లు సాధించడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ అభివృద్ధి కోసమే తాను అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేశానన్నారు. జీరో బడ్జెట్ ఎన్నికలకు కోరుట్ల ఎన్నికలు నాంది పలికాయని.. తనకు డబ్బులు పంచమని చాలామంది చెప్పినప్పటికీ... తాను మాత్రం కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టానన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ చేశానన్నారు.