Yanamala: రాష్ట్రంలో ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారని భావిస్తున్నారు... కానీ!: యనమల రామకృష్ణుడు

Yanamala fires on YCP govt

  • వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తిన యనమల
  • జగన్ నిర్ణయాలతో వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని వెల్లడి
  • సొంత పార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారని వ్యాఖ్యలు

రాష్ట్రంలో ప్రజలంతా నిశ్శబ్దంగా ఉన్నారని భావిస్తున్నారని, కానీ జగన్ రెడ్డి దోపిడీ, మితిమీరిన అహంకారంతో ప్రజల తిరుగుబాటు బహిరంగమవుతోందని టీడీపీ సీనియర్ నేతల యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. తొలుత జగన్ రెడ్డి చేతకాని పాలనపై సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు బయటపెట్టారని, ఆ తర్వాత ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారని వెల్లడించారు. 

పంచాయతీల్లోని సమస్యలపై ఎంపీటీసీలు, సర్పంచులు గళం విప్పి నిలదీశారని,  అభ్యర్ధుల మార్పు నిర్ణయాలతో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం ధిక్కార స్వరం వినిపిస్తున్నారని వివరించారు. మరోవైపు, నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ అరాచకాలు, ధరల బాదుడు, పన్నుల మోత, ఇసుక, మద్యం వంటి అంశాలపై నిశ్శబ్దంగా ఉన్న సామాన్యులు గేరు మార్చి స్వరం విప్పుతున్నారని యనమల తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసినందుకు అంగన్వాడీ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు, మున్సిపల్ ఉద్యోగులు రోడ్డెక్కి సమరశంఖం పూరించారని పేర్కొన్నారు. 

"తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలను రూ.4200 నుండి రూ.10,500 చేస్తే అంగన్వాడీలకు అండగా ఉంటానని, తెలంగాణ కంటే వెయ్యి అదనంగా ఇస్తానని జగన్ అన్నారు. ఇప్పుడు తెలంగాణలో రూ.13,500 ఇస్తుంటే ఇక్కడ అంతకంటే తక్కువగా రూ.11,500 మాత్రమే ఇస్తూ మోసం చేస్తుండడంపై అంగన్వాడీలు రోడ్డెక్కారు. రూ.5 వేల వేతనాల వాలంటీర్ ఉద్యోగాలతో సరిపెట్టుకోవాలనే నయవంచనపై వాలంటీర్లు ఇప్పటికే సమ్మె నోటీసులిచ్చారు. వారి తిరుగుబాటే యువగళం విజయవంతానికి నాంది. 

పనికితగ్గ వేతనం ఇస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు తమ వేతనాలు రూ.26 వేలకు పెంచాలంటూ మున్సిపల్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. కనీస వేతనం, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించాలి, పనిభారం తగ్గించాలి, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా సెలవులు ఇవ్వాలనే డిమాండ్లతో ఆశ వర్కర్లు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నారు.    

అమరావతే రాజధాని అనే మాటపై మడమ తిప్పి మూడు రాజధానులంటూ దగా చేసినందుకు అమరావతి రైతులు దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నారు. పార్టీ పెట్టిన రోజు నుండి వెంటే ఉన్న నాయకుల్ని నమ్మించి మోసం చేసినందుకు వెంట నడిచి తప్పు చేశామంటూ వారంతా రోడ్డెక్కి నినదిస్తున్నారు. జగన్ రెడ్డి మేలు కోసం సొంత నియోజకవర్గంలోని రాజధానిపై కేసులతో నిందలేసి, అభివృద్ధిని అడ్డుకుని తప్పు చేశానంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశాడు. 

వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ప్రజల ముందు తలదించుకోవాల్సి వచ్చేదంటూ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు బహిరంగంగా ప్రకటించి జగన్ రెడ్డి చేతకాని పాలనను, దుర్మార్గాలను బట్టబయలు చేశారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వేలాది మందిపై దాడులకు పాల్పడ్డారు. తప్పుడు కేసులతో వేధించడంపై ఆయా వర్గాలన్నీ రోడ్డెక్కుతున్నాయి. మద్యాన్ని నిషేధించిన తర్వాతే అధికారంలోకి వస్తానని ఎన్నికలకు ముందు మహిళలకు మాటిచ్చిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల కోట్ల విలువైన కల్తీ మద్యం అమ్మి, లక్ష కోట్లు దిగమింగాడు. వేలాది మంది ప్రాణాలు పోయిన నేపథ్యంలో, మద్య నిషేధం ఎక్కడంటూ మహిళలు రోడ్డెక్కుతున్నారు. 

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.58 వేల కోట్ల భారం వేశాడు. ట్రూ అప్ ఛార్జీలు, సర్ ఛార్జీల పేరుతో బిల్లుల బాదుడుపై జనం తిరగబడుతున్నారు. చెత్తపై పన్ను, మరుగుదొడ్లపై పన్నులు వేయడంపై ప్రజలు బహిరంగంగానే తిరుగుబాటు చేశారు. 

జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. పోలవరం ఎత్తు తగ్గించి పనులు ఆపేశాడు. 

అన్నమయ్య డ్యాం గేట్లు మరమ్మతులు చేయక కొట్టుకుపోయింది. కృష్ణా, తుంగభద్ర జలాలపై హక్కుల్ని ధారాదత్తం చేసి రాయలసీమ ప్రాజెక్టులకు ద్రోహం చేయడంపై సీమ ప్రజలంతా ఉద్యమిస్తున్నారు. మెరుగైన ఇసుక పాలసీ పేరుతో ఇసుక మొత్తాన్ని సిండికేట్‌గా మారి కొట్టేశాడు. వేల కోట్లు దోచేశాడు. ఇసుక దొరకక దాదాపు 132 వృత్తులు, వ్యాపారాలను దెబ్బతీయడంతో నిర్మాణదారులు బహిరంగంగానే గళమెత్తి జగన్ రెడ్డి దోపిడీపై మండిపడుతున్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ హామీపై మడమ తిప్పాడు. రూ.3వేల పెన్షన్ హామీని తుంగలో తొక్కాడు. పీజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ దూరం చేశాడు. కౌలు రైతులకు రైతు భరోసా రద్దు చేశాడు. ఇలా మేనిఫెస్టో హామీలపై చేసిన మోసాలపై ప్రజలు నిలదీస్తున్నారు. 

కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న హామీని గాలికొదిలి, పరిశ్రమలు తరిమేసి, పెట్టుబడులు రద్దు చేసిన విధానాలపై యువత గళమెత్తి ప్రశ్నిస్తోంది" అంటూ యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News