Mopidevi Venkataramana: నేను ఎన్నికల్లో ఓడినా గౌరవానికి లోటు లేకుండా చేశారు... జగన్ ను వదులుకోను: మోపిదేవి వెంకటరమణ
- రేపల్లె వైసీపీ ఇన్చార్జిగా మోపిదేవి స్థానంలో ఈపూరు గణేశ్
- బాపట్ల జిల్లాలో మోపిదేవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం
- రాజకీయాల్లో ఇష్టం లేని వ్యక్తులతో కొనసాగాల్సి వస్తోందని వ్యాఖ్యలు
- తాజాగా, ఈపూరు గణేశ్ విజయానికి కృషి చేస్తామని వెల్లడి
బాపట్ల జిల్లాలో ఓ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. రాజకీయాల్లో ఇష్టం లేని వ్యక్తులతో కొనసాగాల్సి వస్తోందని, మనసు చంపుకుని పనిచేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. చెరుకుపల్లిలో ఉపాధ్యాయుల సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేపల్లె నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా మోపిదేవిని తప్పించి ఈపూరు గణేశ్ ను నియమించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తన మాటలు చర్చనీయాంశంగా మారడం పట్ల మోపిదేవి స్పందించారు. తాను ఎన్నికల్లో ఓడినప్పటికీ జగన్ తనను ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారని వెల్లడించారు. ఆ తర్వాత శాసనమండలి రద్దు అనే మాట రావడంతో తనను ఖాళీగా ఉంచకుండా వెంటనే రాజ్యసభకు పంపారని మోపిదేవి వివరించారు.
అందుకే, జగన్ లాంటి వ్యక్తిని ఎప్పటికీ వదులుకోనని స్పష్టం చేశారు. జగన్ మాట తనకు వేదం అని స్పష్టం చేశారు. ఆయన ఏం చెబితే అది చేస్తానన్నారు. ఎన్నికల్లో ఓడిన తనకు జగన్ ఇచ్చిన గౌరవం తనకు మాత్రమే కాకుండా, కార్యకర్తలకు, తన సామాజిక వర్గానికి కూడా చెందుతుందని మోపిదేవి పేర్కొన్నారు.
రేపల్లె నియోజకవర్గానికి ఈపూరు గణేశ్ ను ఇన్చార్జిగా నియమించారని, ఈ నిర్ణయంతో కార్యకర్తల్లోనూ, తన సామాజిక వర్గ పెద్దల్లోనూ కొంత స్తబ్దత ఏర్పడిన మాట వాస్తవమేనని చెప్పారు. తనను మత్స్యకార సామాజిక వర్గం వారు ఓ పెద్దగా భావిస్తారని వెల్లడించారు. అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థి ఈపూరు గణేశ్ విజయానికి తామంతా సన్నద్ధమవుతున్నామని స్పష్టం చేశారు.