AP High Court: స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలన్న ఉండవల్లి పిటిషన్ పై హైకోర్టులో విచారణ
- స్కిల్ కేసులో దర్యాప్తు చేస్తున్న సీఐడీ
- ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన ఉండవల్లి
- 14 మంది ప్రతివాదులు నోటీసులు తీసుకోలేదని నేడు కోర్టులో వివరణ
- విచారణను వారం రోజులకు వాయిదా వేసిన హైకోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా... 14 మంది ప్రతివాదులు నోటీసులు తీసుకోలేదని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. డోర్ లాక్ (ఇంట్లో ఎవరూ లేకపోవడం), ఇతర కారణాలతో నోటీసులు తిరిగి వచ్చాయని వివరించారు. ఈ కేసుకు సంబంధించిన కొందరు ప్రతివాదులు ఢిల్లీ, మహారాష్ట్రలోనూ ఉన్నారని, వారికి పత్రికా ప్రకటన ద్వారా నోటీసులు ఇస్తామని కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి మెమో దాఖలు చేయడం జరిగిందని పిటిషనర్ వెల్లడించారు.
వాదనలు విన్న పిమ్మట ఏపీ హైకోర్టు విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
ఈ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయగా, ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో, ఇటీవలే రాజమండ్రి జైలు నుంచి బయటికి వచ్చారు.