sridhar babu: దరఖాస్తు కోసం ఆందోళన వద్దు... హైదరాబాద్‌లో 21 లక్షల మందికి ఇళ్లు అందిస్తాం: మంత్రులు
- ఏ రోజున ఏ గ్రామంలో సభలు నిర్వహిస్తారనేది అధికారులు సమాచారం ఇస్తారని వెల్లడి
- గ్రేటర్‌లోని 150 వార్డులలో ఒక్కో వార్డులో నాలుగు కౌంటర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామన్న మంత్రులు
- పెన్షన్ అందుతున్నవారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
- హైదరాబాద్ దరఖాస్తులపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వివరణ
ప్రజాపాలనలో భాగంగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీల కోసం అధికారులు రేపటి నుంచి దరఖాస్తులు తీసుకుంటారని మంత్రులు తెలిపారు. గ్యారెంటీల దరఖాస్తు కోసం ప్రజలు కంగారుపడవద్దని సూచించారు. ఏ రోజున ఏ గ్రామంలో సభలు నిర్వహిస్తారనేది అధికారులు సమాచారం ఇస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 వార్డులలో ఒక్కో వార్డులో నాలుగు కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఒక్కో కౌంటర్‌కు ఒక టీమ్ లీడర్, ఏడుగురు సభ్యులు ఉంటారన్నారు. వార్డులోని ఏ బస్తీలో? ఏ రోజు కౌంటర్ ఏర్పాటు చేస్తారు? అనే అంశాలపై ముందే సమాచారం ఇస్తారని తెలిపారు.
దరఖాస్తు కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రులు సూచించారు. ఒకవేళ కౌంటర్ ఏర్పాటు చేసిన రోజు కనుక దరఖాస్తు చేసుకోని పరిస్థితుల్లో.. 6వ తేదీ వరకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డు, ఇతర పరిష్కారాల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించామని... వారు రేపు స్థానిక ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ, కార్పోరేటర్లతో సమావేశం నిర్వహించి సూచనలు చేస్తారన్నారు. ఇప్పటికే పెన్షన్ అందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చారు.
ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చినవారు అవసరమైతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. అందరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. హైదరాబాద్‌లో 21 లక్షల మందికి ఇళ్లు అందిస్తామని... ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కౌంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ధ్వజమెత్తారు.