Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో బస్సు-డంపర్ ఢీ.. మంటలు చెలరేగి 12 మంది మృతి

12 killed in bus and dumper collision in Madhya Pradesh
  • బుధవారం రాత్రి 9 గంటల సమయంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం
  • మంటలు చెలరేగడంతో భారీగా ప్రాణనష్టం
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం మోహన్ యాదవ్.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, డంపర్‌ ఢీకొన్న ఘటనలో ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఎగసిపడి బస్సు పూర్తిగా దగ్ధమైంది. గుణ-ఆరోన్ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను చికిత్స కోసం గుణ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆరోన్‌కు వెళ్తున్న బస్సు, గుణ వైపు వస్తున్న డంపర్ రాత్రి 9 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయని స్థానిక ఎస్పీ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో నలుగురు మాత్రమే పెద్దగా గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు.

ఈ ఘోర ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై విచారణకు ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. కాగా ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ వెల్లడించారు.
Madhya Pradesh
bus and dumper collision
Road Accident
Mohan Yadav

More Telugu News