Ranbir Kapoor: మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ రణబీర్ కపూర్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
- క్రిస్మస్ వేడుకల్లో కేక్‌పై వైన్ పోసి లైట్ వెలిగించడంపై ఫిర్యాదు చేసిన ఇద్దరు న్యాయవాదులు
- హిందూమత విశ్వాసాలను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొన్న ముంబై లాయర్లు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా ఫిర్యాదు
‘యానిమల్’ మూవీ బ్లాక్‌బాస్టర్ విజయం సాధించడంతో మంచి జోష్‌లో ఉన్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన కేక్ కటింగ్ ఇందుకు కారణమైంది. ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో జహాన్ కపూర్ కేక్‌పై వైన్ పోయగా రణ్‌బీర్ కపూర్ లైటర్‌తో నిప్పు అంటించాడు. అంతేకాదు ‘జై మాతా ది’ అని రణ్‌బీర్ అనడం వైరల్‌గా మారిన వీడియోలో వినిపించింది. దీంతో రణ్‌బీర్ కపూర్ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ ముంబైకి చెందిన ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా అనే ఇద్దరు న్యాయవాదులు ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మాన్ని అవమానపరిచారని పేర్కొన్నారు.
‘‘హిందూమతంలో ఇతర దేవతలను పూజించడానికి ముందు అగ్ని దేవుడిని ఆరాధిస్తారు. అయితే కపూర్, అతడి కుటుంబ సభ్యులు ఇతర మతానికి సంబంధించిన పండుగ వేడుకల్లో హిందూమతంలో నిషేధిత మత్తు పదార్థాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారు. జై మాతా ది అని నినాదాలు కూడా చేశారు’’ అని ఫిర్యాదులో న్యాయవాదులు ప్రస్తావించారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ తరహా వీడియోల ప్రచారం కారణంగా శాంతిభద్రతలు ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రణ్‌బీర్ కపూర్‌పై సెక్షన్ 295 ఏ (మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం), సెక్షన్ 298 (మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం), సెక్షన్ 500 (పరువు నష్టం), సెక్షన్ 34 కింద కేసు నమోదు చేయాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.
కాగా కునాల్ కపూర్ నివాసంలో రెండు రోజులక్రితం రణబీర్ కపూర్, అతడి కుటుంబ సభ్యులు క్రిస్మస్ లంచ్‌లో భాగంగా కేక్ కటింగ్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో 'ఫరాజ్' సినిమాతో అరంగేట్రం చేసిన యువ నటుడు జహాన్ కపూర్‌తోపాటు సన్నిహిత కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.