Bonda Uma: అధికారం కోసం అవాస్తవాలు... సీఎం అయ్యాక కక్ష సాధింపులు... ఇదీ జగన్ రెడ్డి నైజం!: బొండా ఉమ
- సీఎం జగన్ పై పుస్తకం ఆవిష్కరించిన టీడీపీ నేతలు
- మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకావిష్కరణ
- హాజరైన అచ్చెన్నాయుడు, బొండా ఉమ, వర్ల రామయ్య, టీడీ జనార్దన్ తదితరులు
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ‘నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ అనే పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు బొండా ఉమ, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, టీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అధికారం కోసం అవాస్తవాలు చెప్పడం, సీఎం అయ్యాక కక్ష సాధింపులు, దోపిడీలకు పాల్పడడమే జగన్ రెడ్డి నైజం అని మండిపడ్డారు. “అధికారంకోసం జగన్ రెడ్డి ప్రజలకు చెప్పిన అవాస్తవాలకు ప్రతిరూపమే టీడీపీ విడుదలచేసిన పుస్తకం. అలానే సాక్షి టీవీలో ప్రసారమైన జగన్ రెడ్డి హామీల తాలూకా వీడియో క్లిప్పింగ్స్ ను కూడా ప్రజలముందుకు తీసుకొచ్చాం. మరో 3 నెలల్లో జగన్ రెడ్డి ఇంటికెళ్లడం ఖాయం. ఈ నేపథ్యంలో మోసకారి జగన్ రెడ్డి మాటలు, హామీలు ప్రజలకు గుర్తుచేయడానికే టీడీపీ ఈ పుస్తకాన్ని విడుదల చేసింది.
కేవలం అధికారం కోసమే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇవ్వనన్ని హామీలు జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చాడు. అధికారం చేతికందగానే కక్షసాధింపులు, దోపిడీయే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడి, విశాఖపట్నంలో వేలకోట్ల విలువైన భూములు కొట్టేశాడు. జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా పేరుతో యువత, నిరుద్యోగుల్ని వంచించాడు.
అవినీతి, దోపిడీతో పారిశ్రామిక వేత్తల్ని భయపెట్టి, రాష్ట్రంలోని పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయేట్టు చేశాడు. ఇసుక దోపిడీతో భవనిర్మాణ కార్మికులు సహా, వివిధ రంగాల కార్మికుల పొట్టకొట్టాడు. ఇంత మోసకారీ ముఖ్యమంత్రి భారతదేశంలో మరెవరూ ఉండరు. జగన్ రెడ్డి మోసాలు, అబద్ధాలు ప్రజలకు తెలియచేసి, అతనిచ్చిన హామీలను జనం ముందు ఉంచి, అతని బాగోతం బట్టబయలు చేస్తాం” అని బొండా ఉమ స్పష్టం చేశారు.
మద్యపాన సేవనం పెంచి 30 లక్షల మందిని ఆసుపత్రుల పాల్జేశాడు: వర్ల రామయ్య
కేవలం ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలన్న ఉబలాటం తప్ప, జగన్ రెడ్డికి ప్రజల యోగక్షేమాలు, సాదకబాధకాలు పట్టవని అర్థమైంది. జగన్ రెడ్డి అమ్ముతున్న కల్తీ మద్యంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది పేదలు ఆసుపత్రుల పాలయ్యారు. ఇంత చేసిన ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని మహిళల ఓట్లు అడుగుతారు? జగన్ రెడ్డి మేనిఫెస్టో అంతా పచ్చి బూటకం... అబద్ధాల పుట్ట, ఇక ఆయన్ని, ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరు” అని రామయ్య తేల్చిచెప్పారు.
జగన్ రెడ్డి ఎంత మోసకారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి: టీడీ జనార్థన్
తెలుగుదేశం పార్టీ నేడు విడుదల చేసిన ఈ పుస్తకంలో జగన్ రెడ్డి హామీలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే పొందుపరిచాం. నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్లలో 102 సభల్లో జగన్ రెడ్డి చెప్పిన అంశాలు, వివిధ సందర్భాల్లో ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే జనంలో ఎండగడతాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జగన్ రెడ్డి ఎంత మోసకారో తెలుసుకోవాలి.