Canada: కెనడాలో హిందూ వ్యాపారిపై కాల్పులు.. భయాందోళనలో హిందూ సమాజం

Shots fired on Hindu business man in Canada
  • బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులోని సర్రేలో ఘటన
  • లక్ష్మీనారాయణ్ మందిర్ అధ్యక్షుడు సతీశ్ కుమార్ కొడుకును లక్ష్యంగా చేసుకుని కాల్పులు
  • 14 రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు
కెనడాలో ఓ హిందూ వ్యాపారిపై జరిగిన కాల్పులు కలకలం రేపాయి. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులోని సర్రేలో ఓ వ్యాపారవేత్త ఇంటిపై జరిగిన కాల్పులపై అధికారులు విచారణ ప్రారంభించారు. బుధవారం (27న) ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్రేలోని లక్ష్మీ నారాయణ్ మందిర్ అధ్యక్షుడైన సతీశ్ కుమార్ పెద్ద కుమారుడిని లక్ష్యంగా చేసుకుని దుండగులు ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు. 

తన కుమారుడి ఇంటిపై దుండగులు 14 రౌండ్లు కాల్పులు జరిపినట్టు సతీశ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇల్లు మాత్రం తూటా రంధ్రాలతో నిండిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కొన్ని గంటలపాటు అక్కడే ఉండి ఆధారాలను పరిశీలించారు. 

ఇటీవలి కాలంలో కెనడాలో హిందూ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు అధికమయ్యాయి. పలు ప్రాంతాల్లో హిందూ ఆలయాలను దుండగులు ధ్వంసం చేశారు. వీటి వెనక ఖలిస్థానీ గ్రూపులు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాజా ఘటన నేపథ్యంలో హిందూ సమాజంలో ఆందోళన నెలకొంది.
Canada
Hindu Business Man
Surrey
British Colombia
Khalistan Groups

More Telugu News