Dense Fog: తెలంగాణను కమ్మేసిన పొగమంచు.. రేపు కూడా ఇదే తీరు
- పొగమంచుకు తోడు వీస్తున్న శీతల గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
- రాష్ట్రంలో రోజురోజుకు గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యంత కనిష్ఠంగా 8.9 డిగ్రీల నమోదు
- ఆదిలాబాద్లో అత్యంత గరిష్ఠంగా 31.3 డిగ్రీలుగా రికార్డు
ఉత్తరభారతదేశం లాంటి పరిస్థితులే తెలంగాణలోనూ నెలకొన్నాయి. ఈ ఉదయం రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. దీనికితోడు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువస్థాయిలో వీస్తున్న శీతల గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. రేపు కూడా ఇవే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు మరింతగా పడిపోతున్నాయి. బుధవారం రాత్రి రాష్ట్రంలో అత్యంత కనిష్ఠంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో 10.8, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 10.9, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 11.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న ఆదిలాబాద్లో అత్యంత గరిష్ఠంగా 31.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 2.7 డిగ్రీలు అధికం. మిగతా జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి.