Komatireddy Venkat Reddy: ప్రాజెక్టులను ఇంజినీర్ల సలహాలు తీసుకుని కట్టారా? లేక కేసీఆరే స్వయంగా డిజైన్ చేశారా?: మంత్రి కోమటిరెడ్డి
- ప్రాజెక్టుల కోసం కేసీఆర్ అసలు ఇంజినీర్ల సలహాలు తీసుకున్నారా? అని ప్రశ్న
- ఇలాంటి ప్రాజెక్టు కట్టమంటే సెలవు పెట్టి వెళ్లాల్సింది అని ఇంజనీర్లకు సూచన
- తప్పును తప్పుగా చెప్పాల్సిందేనని ఇంజినీర్లకు హితవు
ప్రాజెక్టుల నిర్మాణం కోసం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసలు ఇంజినీర్ల సలహాలు తీసుకున్నారా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం శుక్రవారం పరిశీలించింది. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు బ్యారేజీని పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్టులను ఇంజినీర్ల సలహాలు తీసుకొని కట్టారా? లేక కేసీఆరే స్వయంగా చీఫ్ ఇంజినీర్‌గా డిజైన్ చేశారా? అన్నది ప్రజలకు తెలియాలన్నారు. సాధారణంగా కిందకు వెళ్లే నీటిని... బ్యారేజీ కట్టి పైకి తీసుకు వచ్చి మళ్లీ కిందకు వదలడం తుగ్లక్ చర్య అన్నారు.
అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఆశ్చర్యం వేసిందన్నారు. అసలు ఇలాంటి ప్రాజెక్టు కట్టమని చెబితే మీరు (ఇంజినీర్లు, అధికారులను ఉద్దేశించి) సెలవు పెట్టి వెళ్లివుండాల్సింది... అని సూచించారు. అసలు ఏం పిచ్చి ప్రాజెక్టు ఇది? అని వ్యాఖ్యానించారు. అసలు ఇక్కడ మూడో టీఎంసీ అవసరమే లేదన్నారు. ముఖ్యమంత్రి అయినా... మంత్రులు అయినా... ఎవరు ఉన్నా ప్రజల కోసం ఇంజినీర్లు తప్పును తప్పుగా చెప్పాల్సిందే అన్నారు. మీరు ప్రజలను కాపాడాల్సిన వారు అని ఇంజినీర్లతో అన్నారు. ప్రాణహిత, గౌరవెల్లి ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో వాటిని పక్కన పెట్టారన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే అధికారులు సెలవు పెట్టి వెళ్లాలన్నారు.
కొండపోచమ్మ వద్ద ఎప్పుడూ నీరు ఉంటుందని... కానీ అక్కడి నుంచి ఫామ్ హౌస్‌కు తప్ప ఎక్కడకూ నీరు వెళ్లడం లేదన్నారు. ఇంత ఖర్చు చేస్తే అసలు ఎంత ఆయకట్టుకు నీరు వచ్చింది? అని ప్రశ్నించారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం కోసం ఎంత విద్యుత్‌ను ఉపయోగించారు? అని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగినప్పుడు గత ప్రభుత్వం ఎందుకు స్పష్టతను ఇవ్వలేకపోయిందన్నారు. రైతులకు వీటికి సంబంధించి స్పష్టమైన సందేశం పంపించాల్సి ఉందన్నారు.