Yanamala: జగన్ పులివెందులలో కూడా గెలిచే పరిస్థితులు లేవని ఐప్యాక్ హెచ్చరించింది: యనమల
- రాష్ట్రంలో జగన్ కు ఎదురుగాలి మొదలైందన్న యనమల
- వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉందని వెల్లడి
- మీకు, మీ పార్టీకో నమస్కారం అని వైసీపీ ఎమ్మెల్యేలే అంటున్నారని వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగన్ కు ఎదురుగాలి మొదలైందని తెలిపారు. జగన్ తమను స్వార్థానికి వాడుకుని వదిలేశాడని వైసీపీ నేతలే బహిరంగ సభల్లో చెప్పే పరిస్థితులు మనం చూస్తున్నామని పేర్కొన్నారు.
ప్రాధాన్యత లేని చోట, గౌరవం లేని చోట మేం పోటీ చేయలేం, మీకో నమస్కారం, మీ పార్టీకో నమస్కారం అంటూ కొందరు ఎమ్మెల్యేలు జగన్ ముఖం మీదనే చెప్పే పరిస్థితులు వచ్చాయని యనమల వ్యాఖ్యానించారు. జగన్ నిజస్వరూపాన్ని ఇవాళ వారి పార్టీలోని నాయకులే బట్టబయలు చేస్తున్నారని వెల్లడించారు.
వై నాట్ 175 అంటున్న జగన్ నేడు పులివెందులలో కూడా గెలిచే పరిస్థితులు లేవని ఐప్యాక్ హెచ్చరించడం చూస్తుంటే, జగన్ పతనానికి కౌంట్ డౌన్ మొదలైనట్టేనని యనమల స్పష్టం చేశారు.
"గత ఎన్నికల్లో జగన్ వదిలిన బాణం తిరిగి జగన్ వైపే శరవేగంగా దూసుకొస్తోంది. ఆ బాణమే జగన్ ను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవనివ్వకుండా వైసీపీ పునాదులను కూలదోయబోతోంది. వైసీపీని నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను జగన్ ఎన్నికల అస్త్రాలుగా వాడుకున్నాడే తప్ప వారిని మనుషులుగా గుర్తించడంలేదని వాపోతున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం తాము చేసిన పోరాటాలు, త్యాగాలకు విలువ ఇవ్వకుండా... కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం పట్ల వారు లోలోపల కుమిలిపోతున్నారు.
అధికారం, నిధులు తన వద్ద ఉంచుకుని నియోజకవర్గాలను అభివృద్ధి చేయకుండా ఇవాళ ఎమ్మెల్యేలను బలిచేస్తున్నాడు. వారికి సీట్లు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నాడు. ఏపీ చరిత్రలో మునుపెన్నడూ లేని వింత, వికృత సంస్కృతిని జగన్ అవలంబించడం పట్ల వైసీపీ నేతలు ఆయోమయానికి గురవుతున్నారు.
ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు జగన్ ను సీఎం పీఠం ఎక్కించారో, అవే సామాజిక వర్గాలు నేడు వైసీపీ పునాదులను కూలదోయడానికి, జగన్ ను తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితం చేయడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నాయి.
జగన్ రెడ్డీ... నీ అవినీతి, నీ అక్రమాలు, నీ దుర్మార్గాలు, నీ నయవంచనకు తగిన బుద్ధిని రాష్ట్ర ప్రజలు 2024లో చెప్పబోతున్నారు" అంటూ యనమల పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయదుందుభి మోగించేది టీడీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.