Konda Surekha: మంత్రి కొండా సురేఖ వర్సెస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి
- కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై సిద్దిపేట హరిత హోటల్లో సమావేశం
- జాతరపై ఇలా హోటల్లో ఎప్పుడూ సమావేశం నిర్వహించలేదని పల్లా ఆగ్రహం
- తమకు ఎవరినైనా ఎప్పుడైనా పిలుచుకునే అధికారం ఉంటుందని వ్యాఖ్య
మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. సిద్దిపేట హరిత హోటల్లో కొండా సురేఖ ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులను వేదికపైకి ఆహ్వానించడాన్ని పల్లా రాజేశ్వరరెడ్డి తప్పుబట్టారు. ఓడిపోయిన వారిని అలా పిలవడాన్ని జీర్ణించుకోలేక పల్లా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ... సంప్రదాయాలకు, ఆచారాలకు వ్యతిరేకంగా మల్లన్న జాతరపై సిద్దిపేటలో సమావేశం నిర్వహించారని... ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని వేదికపైకి పిలవడం దురదృష్టకరమన్నారు. శ్రీ మల్లికార్జునస్వామి గుడిలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. ముప్పై ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా హోటల్లో సమావేశం పెట్టలేదన్నారు.
పల్లా ఆరోపణలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఎమ్మెల్యే పల్లా ఈ సమావేశంలో ఉండలేక వెళ్లిపోయారని ఆరోపించారు. తమకు ఎవరినైనా ప్రత్యేకంగా పిలుచుకునే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.