Japan: జపాన్ తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికల జారీ
- జపాన్ లోని ఇషికావా తీరానికి సమీపంలో భూకంప కేంద్రం
- రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు
- పలుమార్లు భూమి కంపించడంతో భయాందోళనలో ప్రజలు
నూతన సంవత్సరాది వేళ జపాన్ భారీ భూకంపంతో ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. దాంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పలుమార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇషికావా ప్రాంత తీరానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.
ఒకవేళ సునామీ వస్తే 5 మీటర్ల ఎత్తున రాకాసి అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఎన్ హెచ్ కే టీవీ వెల్లడించింది. ప్రజలు ఎత్తుగా ఉన్న ప్రదేశాలకు తరలి వెళ్లాలని స్పష్టం చేసింది.
కాగా, సునామీ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో, ఇషికావా ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. 2011 మార్చి 11న సంభవించిన భూకంపం కారణంగా సునామీ రావడంతో, ఫుకుషిమా ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి.