Botsa Satyanarayana: నేడు ఒక బీసీ ఆడకూతురి కార్యాలయంపై మీ శ్రేణులు ఏకంగా దాడులు చేశాయి: చంద్రబాబుపై బొత్స విమర్శలు
- మంత్రి రజని ఆఫీసుపై టీడీపీ-జనసేన శ్రేణులు దాడి చేశాయంటూ వైసీపీ నేతల ఫైర్
- చంద్రబాబు బీసీలపై అహంకార ధోరణిని మార్చుకోవాలన్న బొత్స
- వెనుకబడిన కులాలను జగన్ ప్రోత్సహిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యలు
ఏపీ మంత్రి విడదల రజని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులు చేశారంటూ వైసీపీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబూ... బీసీలపై మీ అహంకార ధోరణిని ఇకనైనా మార్చుకోండి అంటూ ధ్వజమెత్తారు.
"సమస్య చెప్పుకుని సాయం అర్థించడానికి వచ్చిన బీసీ కులాల ప్రతినిధులను ఉద్దేశించి గతంలో "తోకలు కత్తిరిస్తా" అన్నారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని సుప్రీంకోర్టుకు లేఖలు రాశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండాలని మా ప్రభుత్వం నిర్ణయించింది... కానీ అవి అమలు కాకుండా కోర్టుల్లో కేసులు వేశారు. బీసీ బిడ్డల చదువు అటకెక్కించి... వారికి కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారు. ఐదేళ్లలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు" అంటూ విమర్శలు చేశారు.
"నేడు ఒక బీసీ ఆడకూతురి కార్యాలయంపై మీ శ్రేణులు ఏకంగా దాడులు చేశాయి... చరిత్రలో ఏనాడూ రాజకీయ ప్రాధాన్యత లభించని కులాలను గుర్తించి జగన్ గారు ప్రోత్సహిస్తుంటే తట్టుకోలేకపోతున్నారా?" అంటూ బొత్స ప్రశ్నించారు.