South Korea: దక్షిణకొరియా ప్రతిపక్ష పార్టీ అధినేతపై కత్తితో దాడి.. ఆటోగ్రాఫ్ అడిగి ఘాతుకం

South Koreas opposition leader stabbed in the neck during visit to Busan

  • ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం ప్రతిపక్ష నేత లీ జే-మియుంగ్ స్థలాన్ని పరిశీలిస్తుండగా ఘటన
  • ఆటోగ్రాఫ్ కోసం అంటూ వచ్చి మెడపై కత్తితో పొడిచిన ఆగంతుకుడు
  • ఘటనా స్థలంలో కుప్పకూలిన లీని ఆసుపత్రికి తరలింపు

దక్షిణ కొరియా ప్రధాన ప్రతిపక్షం డెమోక్రెటిక్ పార్టీ అధినేత‌ లీ జే-మియుంగ్‌పై మంగళవారం హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆయన మెడపై అకస్మాత్తుగా కత్తితో పొడిచాడు. బూసాన్ నగరంలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలనకు లీ వెళ్లిన సందర్భంగా ఈ దారుణం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

స్థానిక మీడియా కథనాల ప్రకారం, లీపై దాడికి పాల్పడ్డ నిందితుడికి సుమారు 60 ఏళ్లు ఉంటాయి. ఎయిర్‌పోర్ట్ స్థల పరిశీలనకు వచ్చిన లీజే మియుంగ్‌ను ఆటోగ్రాఫ్ కోసం సమీపించిన నిందితుడు ఆ తరువాత ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. చేతిలో కత్తితో లీ మెడలో పొడించాడు. అయితే, పక్కనున్న ఇతరులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడితో కుప్పకూలిపోయిన లీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, 2022లో జరిగిన ఎన్నికలలో లీ స్వల్ప తేడాతో ఓడిపోగా సుక్ యిలోల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 
  
దక్షిణకొరియాలో ఇలాంటి రాజకీయదాడులు గతంలోనూ అనేకం జరిగాయి. తుపాకీలపై ఆంక్షలు ఉండటంతో ఇతర ఆయుధాలతో నిందితులు దాడులకు తెగబడ్డారు. 2006లో అప్పటి ప్రతిపక్ష అధినేత పార్క్ గ్యున్ హై ముఖంపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయం కావడంతో ఆమెకు సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News