Japan Earthquake: భూకంపం ధాటికి ఊగిపోయిన జపాన్ మెట్రో స్టేషన్.. వీడియో ఇదిగో!
- ఒక్క రోజులో 155 భూకంపాలు.. 24 మంది మృతి
- శిథిలాల కింద చిక్కుకున్న మరికొంతమంది పౌరులు
- మృతుల సంఖ్య పెరగొచ్చని జపాన్ ప్రధాని ఆందోళన
వరుస భూకంపాలు జపాన్ ను కుదిపేశాయి. ఒక్క రోజులోనే ఏకంగా 155 సార్లు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై అత్యధికంగా 7.6 గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసం కాగా చాలా ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటి వరకు 24 మంది చనిపోయారని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. కూలిన నిర్మాణాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉంటారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్మీ సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ ను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టామని ప్రధాని తెలిపారు. ప్రాణనష్టం వీలైనంత వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. సముద్రంలో అలలు భారీగా ఎగిసిపడడంతో తీర ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. కాగా, భూకంప తీవ్రతకు ఓ మెట్రో స్టేషన్ అల్లల్లాడుతున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. దీంతోపాటు భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.