AP High Court: ఏపీ ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు విచారణ
- విశాఖకు ఆఫీసుల తరలింపుపై సింగిల్ బెంచ్ జడ్జి స్టే
- ఈ ఆదేశాలను డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన ప్రభుత్వం
- ‘నాట్ బిఫోర్ మి’ అంటూ తప్పుకున్న ధర్మాసనంలోని జస్టిస్ రఘునందనరావు
రాజధాని కార్యాలయాలను విశాఖకు తరలించే విషయంపై హైకోర్టు డివిజన్ బెంచ్ లో మంగళవారం విచారణ జరిగింది. ఈ విషయంలో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా.. బెంచ్ లోని ఓ న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు ‘నాట్ బిఫోర్ మి’ అంటూ తప్పుకున్నారు. దీంతో ప్రభుత్వ అప్పీల్ ను మరో ధర్మాసనానికి పంపాలని ప్రధాన న్యాయమూర్తి రిజిస్ట్రీకి సూచించారు.
విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపును గతంలో రాజధాని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో విచారణ పూర్తయ్యే వరకు కార్యాలయాల తరలింపును ఆపేయాలని సింగిల్ బెంచ్ జడ్జి ప్రభుత్వాన్ని ఆదేశించారు. కార్యాలయాల తరలింపుపై త్రిసభ్య ధర్మాసనం విచారించే వరకూ తదుపరి చర్యలు తీసుకోవద్దని పేర్కొన్నారు. ఈ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది.