Nara Lokesh: విశాఖలో బాలికపై గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది: నారా లోకేశ్
- విశాఖలో దళిత బాలికపై గ్యాంగ్ రేప్
- పాపాల పాలకులు విశాఖకు శాపంలా మారారన్న లోకేశ్
- విశాఖను నేరాలు, ఘోరాలకు అడ్డాగా మార్చేశారని ఆగ్రహం
- మరో మూడు నెలల్లో నేరగాళ్ల రాజ్యం అంతమవుతుందని స్పష్టీకరణ
విశాఖలో ఓ దళిత బాలికపై 10 మంది అఘాయిత్యానికి పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు కలిగిస్తోంది. మొదట ఆమెపై ప్రియుడు అత్యాచారం చేయగా, ఆ తర్వాత అతడి స్నేహితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం, మరో ఎనిమిది మంది ఆమెను హోటల్ గదిలో నిర్బంధించి రెండ్రోజుల పాటు అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక... ఈ ఘోరాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. పాపాల పాలకులు ప్రశాంతమైన విశాఖ పాలిట శాపంలా మారారని విమర్శించారు. రాజధాని చేస్తామని విశాఖ నగరాన్ని నేరాలు, ఘోరాలకు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు.
విశాఖలో బాలికపై గ్యాంగ్ రేప్ జరగడం రాష్ట్రంలో భయానక పరిస్థితులకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. సీఎం ఇంటి పక్కనే యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే నేటి వరకు నిందితుడ్ని పట్టుకోలేదని లోకేశ్ తెలిపారు.
"టీడీపీ పాలనలో విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రమోట్ చేశాం. కానీ వైసీపీ విశాఖను అఘాయిత్యాలకు రాజధానిగా మార్చేసింది. రాక్షస పాలనలో రక్షణలేని బాలికలు, మహిళలకు మీ కుటుంబ సభ్యుడిగా నాదో వినతి. మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండండి... నేరగాళ్ల రాజ్యం అంతమవుతుంది... ప్రజా ప్రభుత్వం వస్తుంది... మీ రక్షణ బాధ్యత తీసుకుంటుంది" అంటూ లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.