G. Kishan Reddy: కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి అందుకే కాపాడుతున్నారంటూ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kishan Reddy interesting comments on Revanth Reddy government

  • రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మెజార్టీ లేదని.. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వమని విమర్శలు
  • అందుకే బీఆర్ఎస్‌తో అవగాహన కుదుర్చుకున్నారని ఆరోపణలు
  • కేసీఆర్‌కు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు
  • మంద కృష్ణ మాదిగ పార్టీ నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడి
  • సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారెంటీ అనే చర్చ జరగలేదన్న కిషన్ రెడ్డి

రానున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీలోని సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు, కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ నేతలపై విచారణ తదితర అంశాలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోరుతూ కేంద్రానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ ఎందుకు రాయడం లేదు? అని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్‌కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే ముందు ఎలాంటి భూపరీక్షలు చేయలేదన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని ఆరోపించారు. ఊచలు లెక్కపెట్టాల్సిన కేసీఆర్‌ను కాపాడుతోందని విమర్శించారు.

తెలంగాణలో జరిగిన అవినీతిపై కేసీఆర్ ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించలేదన్నారు. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా జీవో తెచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో సీబీఐ విచారణకు అంగీకరిస్తుందా? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియాలన్నారు. రేవంత్ రెడ్డి సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అప్పుడు విచారణ బాధ్యత కేంద్రం తీసుకుంటుందన్నారు. కేసీఆర్‌ను కాంగ్రెస్ కాపాడుతోందని ఆరోపించారు. అందుకే న్యాయవిచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేదని, అందుకే బీఆర్ఎస్‌తో అవగాహన కుదుర్చుకున్నారని వ్యాఖ్యానించారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వమిదని అన్నారు. కుటుంబ పాలన వల్లే కేసీఆర్ ఓడిపోయారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా ఫలితం శూన్యమన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో లీడర్ ఎవరో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అందుకే బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారెంటీ అనే చర్చ పార్టీలో ఎక్కడా జరగలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ పని చేస్తున్నారని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News