Gunman: కొలరాడో సుప్రీంకోర్టులోకి తుపాకీతో చొరబడ్డ దుండగుడు
- కోర్టు భవనంలో కాల్పులకు పాల్పడ్డ నిందితుడు
- రాత్రి సమయం కావడం, ఎవరూ లేకపోవడంతో తప్పిన అపాయం
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అగ్రరాజ్యం అమెరికాలోని కొలరాడో సుప్రీంకోర్టులో సోమవారం అర్ధరాత్రి దాటాక కలకలం రేగింది. సాయుధుడైన ఓ దుండగుడు సుప్రీంకోర్టు భవనంలోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. అయితే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోర్టు భవనానికి తీవ్రమైన నష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతో దుండగుడు చొరబడ్డాడని పోలీసులు వెల్లడించారు. అయితే తుపాకీతో కోర్టు భవనంలోకి చొరబడ్డ వ్యక్తి ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదన్నారు.
సోమవారం రాత్రి 1:15 గంటల సమయంలో డౌన్‌టౌన్ డెన్వర్‌లోని ఓ భవనం వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ మరో వ్యక్తిపై తుపాకీ గురిపెట్టాడని, ఆ తర్వాత కొద్దిసేపటికే అతడు సుప్రీంకోర్టు భవనంలోకి కిటికీ ద్వారా ప్రవేశించి కాల్పులు జరిపాడని కొలరాడో పోలీసు అధికారులు వెల్లడించారు. దుండగుడు ఏడవ అంతస్తులోకి ప్రవేశించి కాల్పులు జరిపాడని తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి స్వచ్ఛందంగా లొంగిపోయాడని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రకటనలో వివరించారు. కాగా దుండగుడిని ఒక నిరాయుధుడైన సెక్యూరిటీ గార్డు పట్టుకున్నాడని, ఎమర్జెన్సీ నంబర్ 911కు సమాచారం అందించాడని తెలిపారు.
ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడంటూ తీర్పు ఇచ్చిన నాటి నుంచి కొలరాడో సుప్రీంకోర్టుకు, న్యాయమూర్తులకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాజా ఘటన మునుపటి ట్రంప్ వ్యవహారంలో బెదిరింపులకు సంబంధించినది కాదని భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.