Pakistan: 82 ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకోవచ్చు: పాకిస్థాన్ ప్రధాని అన్వర్ ఉల్ హక్
- లేటు వయసులోనూ నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చన్న తాత్కాలిక ప్రధాని
- తన జీవితంలో ఎవరినీ ఆకర్షించే ప్రయత్నం చేయలేదన్న అన్వర్
- న్యూఇయర్ సందర్భంగా పలువురు పౌరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ప్రధాని
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ ‘లవ్ గురు’గా మారిపోయారు. 82 ఏళ్ల వయసులోనూ నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. 52 ఏళ్ల వ్యక్తి తనకు నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చా? అని ఓ పౌరుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. 82 ఏళ్ల వయసులోనూ పెళ్లిని పరిగణించవచ్చు అని బదులిచ్చారు. న్యూఇయర్ సందర్భంగా పలువురు పౌరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తన జీవితంలో ఎవరినీ ఆకర్షించడానికి ప్రయత్నించలేదని, అయితే తాను చాలా మందిని ఆకట్టుకున్నానని అన్వర్ ఉల్ హక్ అన్నారు. డబ్బులేని వారు ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏం చేయాలని ఓ వ్యక్తి ప్రశ్నించగా ఈ సమాధానమిచ్చారు. ఇక విదేశాల్లో జాబ్ వచ్చి ప్రేమను వదిలేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలని ఓ వ్యక్తి అడగ్గా ‘‘ ప్రేమ ఒక అవకాశంగా దొరుకుతుంది. ఉద్యోగం సామర్థ్యాన్ని బట్టి లభిస్తుంది. కాబట్టి అవకాశాన్ని వదులుకోవద్దు’’ అని ప్రేమకే మద్దతు ఇచ్చారు. ఇక పిచ్చి అత్తగారు దొరికితే ఏం చేయాలని మరొక వ్యక్తి ప్రశ్నించగా.. విపత్తు నిర్వహణ కోర్సులో చేరాలని సరదా సమాధానమిచ్చారు. కాగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అన్వర్ ఉల్ హక్ కాకర్ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆయన పర్యవేక్షణలోనే జరగనున్నాయి.