shanthi kumar: ప్రజాపాలన అభయహస్తం డేటా ఎంట్రీపై సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు
- 6వ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని సూచన
- మండల రెవెన్యూ అధికారి, మండల డెవలప్‌మెంట్ అధికారుల పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలన్న సీఎస్
- డేటా ఎంట్రీ కోసం ఈ నెల 4, 5 తేదీల్లో శిక్షణ ఉంటుందని వెల్లడి
- ఈ నెల 17 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు
ప్రజాపాలన - అభయహస్తంలో భాగంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు స్వీకరించే దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీలను ఈ నెల 17వ తేదీ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి... కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణ... డేటా ఎంట్రీపై కలెక్టర్లతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామ లేదా వార్డు సభలను ఇబ్బందులు లేకుండా నిర్వహించడంపై కలెక్టర్లను అభినందించారు. 6వ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని సూచించారు. వీటికి సంబంధించి పూర్తి విచారణ చేయాలని ఆదేశించారు.
మండల రెవెన్యూ అధికారులు, మండల డెవలప్‌మెంట్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమం సూపర్‌వైజరీ అధికారిగా ఉన్న జిల్లాస్థాయి అధికారి దీనిని పర్యవేక్షించాలన్నారు. డేటా ఎంట్రీ కోసం 4, 5 తేదీలలో శిక్షణ ఉంటుందన్నారు. 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. డేటా ఎంట్రీ సందర్భంగా వివరాల నమోదులో ఆధార్ నెంబర్, తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. డీటీపీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని... అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను నియమించుకోవాలన్నారు.