Cardamom prasad: అయోధ్యలో రామయ్య భక్తులకు ఏలకుల ప్రసాదం పంపిణీ
- శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం
- రామ్‌విలాస్ అండ్ సన్స్ దుకాణానికి ప్రసాదం తయారీ బాధ్యతల అప్పగింత
- ప్రాణప్రతిష్ఠ జరగనున్న 22 లోపు సిద్ధం కానున్న 5 లక్షల ప్రసాదం ప్యాకెట్లు
అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు ఏలకుల ప్రసాదాన్ని (ఇలాచీదానా) అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. రామ్‌విలాస్ అండ్ సన్స్ దుకాణానికి ప్రసాదం తయారీ బాధ్యతను అప్పగించినట్టు తెలిపింది. ప్రాణప్రతిష్ఠ జరగనున్న జనవరి 22వ తేదీ లోపు 5 లక్షల ప్రసాదం ప్యాకెట్లను అందించేలా రామ్‌విలాస్ అండ్ సన్స్ దుకాణదారులు పనులు మొదలుపెట్టారు.
ఏలకుల ప్రసాదం విశిష్టతపై మాట్లాడుతూ.. ఉదర సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుందని దుకాణ యజమాని బోల్ చంద్రగుప్తా చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి దీన్ని తమ వద్ద ప్రసాదంగా కొనుగోలు చేస్తారని తెలిపారు. కాగా పంచదార, ఏలకులతో తయారుచేసే ఇలాచీదానాను ఇప్పటికే దేశంలోని కొన్ని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్న విషయం తెలిసిందే.