Telangana: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన కడియం, పాడి కౌశిక్ రెడ్డి
- ఎమ్మెల్యేలుగా గెలవడంతో రాజీనామా చేసిన బీఆర్ఎస్ నేతలు
- 29వ తేదీన ఎన్నికలు... ఫిబ్రవరి 1న ఎన్నికల ఫలితాలు
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు శాసన సభ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఈ నెల 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 18వ తేదీన నామినేషన్ల గడువు ముగియనుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇస్తారు. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.