Revanth Reddy: కేంద్రమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
- రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని అమిత్ షాకు రేవంత్ విజ్ఞప్తి
- అంతకుముందు గజేంద్రసింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరిలను కలిసిన ముఖ్యమంత్రి
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ వరుసగా కేంద్రమంత్రులను కలుస్తూ బిజీగా ఉన్నారు. అంతకుముందు కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరిలను కలిశారు. మరోవైపు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారిలతో కలిసి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కూడా సీఎం కలిశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌లు ఆయనకు వినతిపత్రం అందించారు.