Sonia Gandhi: ఖమ్మం లోక్‌సభ నుంచి సోనియా గాంధీ పోటీ!
- అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులకు అందిన సమాచారం
- సోనియా పోటీకి ఏర్పాట్లపై దృష్టిసారించిన రాష్ట్ర నేతలు
- సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు మంత్రులు నామినేషన్ పత్రాలు సమర్పించే అవకాశం
- తెలంగాణలో పోటీ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు రాబట్టాలని యోచిస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలో నిలవబోతున్నారా? ఖమ్మం లోక్‌సభ నుంచి ఆమె పోటీ చేయడం ఖరారైందా?.. అంటే ఔననే సమాధానమిస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. సోనియా ఖమ్మం నుంచి పోటీ చేస్తారంటూ అధిష్ఠానం నుంచి రాష్ట్ర పార్టీ కీలక నేతలకు సమాచారం అందినట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి. ఈ మేరకు కార్యాచరణను రూపొందించాలని అధిష్ఠానం సూచన చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కోరుతూ టీపీసీసీ డిసెంబర్ నెలలోనే తీర్మానం చేసింది. ఇటీవల రెండోసారి కూడా తీర్మానం చేయగా దానిపై సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారు. గతంలోనే సూత్రప్రాయ అంగీకారం తెలిపినప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది తాజాగా క్లారిటీ వచ్చింది. సోనియా తెలంగాణలో పోటీ చేస్తే ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
సోనియా నామినేషన్ పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు దాఖలు చేస్తారని సమాచారం. ఎన్నికల సమయంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సోనియాగాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా ఖమ్మం నుంచి పోటీ చేస్తే దక్షిణాది నుంచి సోనియా బరిలోకి దిగడం రెండవసారి అవుతుంది. గతంలో కర్ణాటకలోని బళ్లారి నుంచి ఆమె పోటీ చేసి గెలిచారు. పార్టీ బలంగా ఉన్న ఖమ్మం నుంచి సోనియాను బరిలోకి దింపడం ద్వారా రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి.