TSRTC special buses: సంక్రాంతికి టీఎస్ఆర్‌టీసీ 4,484 ప్రత్యేక బస్సులు

TSRTC to run special buses for sankranti
  • జనవర్ 6 నుంచి 15 వరకూ అందుబాటులో ప్రత్యేక బస్సులు
  • హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు సర్వీసులు 
  • సాధారణ చార్జీలు, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం 
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను పురస్కరించుకుని 4,484 ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహించనున్నట్టు తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. జనవరి 6 నుంచి 15 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రత్యేక సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని కూడా చెప్పారు. 

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. చార్జీ పెంపు లేకుండానే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగనీయమన్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్‌బీ నగర్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ తదితర రద్దీ ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలిపారు. 

బస్‌భవన్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ల నుంచి రద్దీ ప్రాంతాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటామని అన్నారు. ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా టోల్‌ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అధిక చార్జీలు చెల్లించి ప్రజలు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించనక్కర్లేదని, ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ సూచించారు.
TSRTC special buses
Sankranti
TSRTC
VC Sajjanar

More Telugu News