India: భారత్ నిజంగానే ఓ ప్రపంచ శక్తి.. చైనా ప్రభుత్వ పత్రికలో కథనం
- గ్లోబల్ టైమ్స్ పత్రికలో ఫుడాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒపీనియన్ ఆర్టికల్
- భారత్ ఆర్థికంగా, దౌత్యపరంగా వేగంగా ఎదుగుతోందన్న ప్రొఫెసర్ జాంగ్ జియడాంగ్
- ఓ దేశం ఇంత వేగంగా మార్పు చెందడం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్య
- భారత్ ప్రపంచశక్తిగా తన ఉనికిని సగర్వంగా చాటుకుంటోందని కామెంట్
చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో భారత్‌ను ప్రశంసిస్తూ ఓ కథనం ప్రచురితమైంది. ఫుడాన్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ సౌతేషియన్ స్టడీస్ డైరెక్టర్ జాంగ్ జియడాంగ్ ఈ కథనాన్ని రాశారు. భారత్ ఆర్థికంగా, అంతర్జాతీయ దౌత్య సంబంధాల పరంగా దూసుకెళుతోందని జియాంగ్ అభిప్రాయపడ్డారు. భారత్ నిజంగానే ఓ గ్లోబల్ పవర్ అని, అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో ఓ దేశం ఇంత వేగంగా మార్పులు సంతరించుకోవడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని చెప్పారు.
‘‘భారత్ ఆర్థిక రంగంలో ఎంతో సాధించింది. అత్యధిక వృద్ధి సాధిస్తున్న దేశంగా మారుతోంది. చైనాతో వాణిజ్య లోటు తగ్గించుకునేందుకు భారత్ ఒకప్పుడు చైనా లక్ష్యంగా వ్యూహాలు రచించేది. ఇప్పుడు ఎగుమతులు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాజకీయ, సాంస్కృతిక రంగాల్లోనూ భారత్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. పాశ్చాత్య భావనలకు భిన్నంగా తన ప్రజాస్వామ్య మూలాలను భారత్ సగర్వంగా ప్రకటిస్తోంది’’ అని ఆయన అన్నారు.
వలసవాద ముద్ర నుంచి బయటపడి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచే లక్ష్యంతో భారత్ ముందుకు దూసుకుపోతోందని జాంగ్ వ్యాఖ్యానించారు. దౌత్యవ్యూహంలోనూ భారత్ తీరు విస్పష్టంగా మారిందని అభిప్రాయపడ్డారు. అమెరికా, రష్యా, జపాన్ లాంటి భిన్న ధ్రువాలతో దౌత్యసంబంధాలు బలోపేతం చేసుకునేలా కొత్త వ్యూహాన్ని భారత్ అమలు చేస్తోందన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ భారత్ తనదైన శైలిలో వ్యవహరించిందని చెప్పారు.
‘‘భారత్ ఎప్పుడూ తనని తాను వరల్డ్ పవర్‌గా భావించేది. కానీ, గత పదేళ్లలో ఈ దిశగా పలుమార్పులు కనిపిస్తున్నాయి. భిన్నధ్రువాలున్న ప్రపంచంలో ఓ శక్తిగా భారత్ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది’’ అని అన్నారు. ప్రపంచయవనికపై భారత్ ప్రస్తుతం ఓ శక్తిమంతమైన దేశమని జాంగ్ తన కథనంలో రాసుకొచ్చారు.