Yellow Urine: మొత్తానికి మూత్రం పచ్చగా ఉండడానికి కారణం తెలిసింది!

What makes urine yellow researchers finally find out the cause
  • మూత్రం పచ్చగా ఉండడానికి యూరోబిలిన్ అనే ఎంజైమే కారణమట 
  • ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైన తర్వాత బిలిరుబిన్ అనే నారింజ రంగు ద్రవం విడుదల 
  • ఆ తర్వాత యూరోబిలిన్‌గా మారి మూత్రం ద్వారా బయటకు
  • మేరీల్యాండ్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
కాస్తంత వేడిచేస్తే మూత్రం పచ్చగా వస్తుంది. ఇలా రావడానికి శరీరంలో తగినంత నీరు లేకపోవడమే (డీ హైడ్రేషన్) కారణమని వైద్యులు చెబుతూ ఉంటారు తప్ప అందుకు గల కచ్చితమైన కారణం మాత్రం చెప్పరు. మూత్రం పసుపు పచ్చగా ఉండడానికి యూరోబిలిన్ అనే ఎంజైము కారణమని 125 ఏళ్ల క్రితమే నిపుణులు గుర్తించినప్పటికీ అది ఎక్కడి నుంచి విడుదలవుతుందన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. 

అయితే, ఇప్పుడీ గుట్టు వీడిపోయింది. అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో మూత్రం పచ్చగా ఉండడానికి గల అసలు కారణాన్ని గుర్తించారు. మూత్రం రంగుకు, ఎర్ర రక్త కణాలకు సంబంధం ఉందని తేల్చారు. ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమైన తర్వాత బిలిరుబిన్ అనే నారింజ రంగులో ఉండే ద్రవాన్ని విడుదల చేస్తాయి. ఇది జీర్ణాశయానికి చేరుకున్న తర్వాత ఉపయోగకరమైన బ్యాక్టీరియా దానిని వివిధ అణువులుగా మార్చుతుంది. 

ఈ క్రమంలో యూరోబిలినోజెన్ అనే రంగులేని ఉప ఉత్పత్తి తయారవుతుంది. ఆ తర్వాత అది క్రమంగా పసుపు రంగులో ఉండే యూరోబిలిన్‌గా మారి మూత్రం ద్వారా బయటకు వస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన అధ్యయన వివరాలు ‘నేచర్ మైక్రోబయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Yellow Urine
Maryland University
Research
USA

More Telugu News