Kesineni Nani: చంద్రబాబుకు నేను వెన్నుపోటు పొడవలేదు: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
- తాను వద్దని చంద్రబాబే అనుకున్నారన్న కేశినేని నాని
- ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని ధీమా
- మీడియాను పట్టించుకోవడాన్ని మానేశానన్న కేశినేని
ఎంపీ కేశినేని నానిని టీడీపీ అధినేత చంద్రబాబు పక్కన పెట్టేయడం విజయవాడ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. తమ అధినేత ఆదేశాలను శిరసా వహిస్తానని ఫేస్ బుక్ ద్వారా ఆయన తెలిపారు. అయితే, కాసేపటి క్రితం మీడియాతో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనని వద్దని చంద్రబాబే అనుకున్నారని, తాను అనుకోలేదని ఆయన అన్నారు. తన మీద, విజయవాడ ప్రజల మీద తనకు నమ్మకం ఉందని, తానేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని తాను ఇంతకు ముందే చెప్పానని అన్నారు. పదేళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ధి చేసిన తాను ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని... పొడిస్తే ఇంకా మంచి పొజిషన్ లో ఉండే వాడినని నాని చెప్పారు. విజయవాడ ఎంపీగా తాను హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే మరొక ఫ్లైట్ చూసుకోవాలని... ఏ ఫ్లైట్ లేకపోతే ప్రైవేట్ జెట్ లో వెళ్లాలి కదా అంటూ పార్టీ మార్పు గురించి సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. నామినేషన్ ల చివరి రోజు వరకు నాన్చకుండా... ఎన్నికలకు చాలా ముందుగానే తనకు టికెట్ లేదని చెప్పేశారని అన్నారు.
చెప్పాల్సిందంతా ఫేస్ బుక్ లో క్లియర్ గా చెప్పేశానని... ఎవరికి అర్థమైనట్టు వారు రాసుకోవచ్చని మీడియాను ఉద్దేశించి నాని అన్నారు. మీడియాను పట్టించుకోవడాన్ని తాను ఎప్పుడో మానేశానని చెప్పారు. మీడియాకు మసాలా కావాలని... తినబోతూ రుచులెందుకని, ఒకేరోజు అన్ని విషయాల గురించి మాట్లాడటం ఎందుకని అన్నారు. రేవంత్ రెడ్డి దొంగ అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఎంతో ప్రచారం చేసిందని... ఇప్పుడు ఆయన సీఎం అయి కూర్చున్నారని చెప్పారు. మీడియా పీకింది ఏముందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.