Bhanuprakash Reddy: జగన్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు... ఆయనను సాగనంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు: భానుప్రకాశ్ రెడ్డి
- టీడీపీతో పొత్తు విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందన్న భానుప్రకాశ్ రెడ్డి
- అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన హామీ ప్రకటనలు ఏమయ్యాయని ప్రశ్న
- ఆంధ్రప్రదేశ్ అంధకారప్రదేశ్ గా మారిపోయిందని ఆవేదన
ఏపీలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. టీడీపీతో పొత్తు విషయాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.
వైసీపీ అధినేత జగన్ వదిలిన బాణం యూటర్న్ తీసుకుని ఆయన వైపే వస్తోందని అన్నారు. ఇలాంటి కోట్ల బాణాలను జగన్ మీదకు వదలడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలతో జగన్ పాలన సాగుతోందని... ఆయనను ఇంటికి సాగనంపడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
తన కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని జగన్ అంటున్నారని... ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టాల్సిన అవసరం ఎవరికుందని భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను అంటూ అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన హామీ ప్రకటనలు ఏమయ్యాయని అడిగారు.
కేంద్ర పథకాలకు స్టిక్కర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా చెప్పుకోవడం మినహా... గత నాలుగున్నర ఏళ్లలో ఆయన చేసిందేముందని ప్రశ్నించారు. సర్వేల పేర్లతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ అభ్యర్థులను ఆయన మార్చడం కాదని... ప్రజలే ఆయనను మారుస్తారని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టులో అవినీతి, ఆలస్యం ఎవరి వల్ల జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ అరాచక పాలన కారణంగా అన్నపూర్ణగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ అంధకారప్రదేశ్ గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.