Justin Trudeau: మరోసారి మొండికేసిన కెనడా ప్రధాని ట్రూడో విమానం

Canada PM Justin Trudeau plane once again stopped with technical glitch

  • భారత్ లో జీ20 సదస్సు సందర్భంగా మొరాయించిన ట్రూడో విమానం
  • రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోయిన ట్రూడో
  • తాజాగా జమైకా టూర్ లోనూ ఇదే తంతు!

ఇటీవల జీ20 దేశాల సదస్సు సందర్భంగా భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తిరుగు ప్రయాణంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆయన విమానం కదలనంటూ మొరాయించింది. సదస్సు ముగిసి దేశాధినేతలందరూ వెళ్లిపోయినా, ఆయన విమానంలో సాంకేతిక లోపం కారణంగా రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోయారు. 

తాజాగా, కెనడా ప్రధాని ట్రూడో విమానం మరోసారి మొండికేసింది. నూతన సంవత్సరాది నేపథ్యంలో, ట్రూడో తన కుటుంబ సభ్యులతో కలిసి జమైకా వెళ్లారు. అయితే, జనవరి 2న విమానం ఇంజిన్, ఇతర వ్యవస్థల పనితీరుకు సంబంధించి తనిఖీలు చేస్తుండగా, సాంకేతిక లోపం బయటపడింది. 

ఆ లోపం కారణంగా విమానం కదిలే పరిస్థితి లేకపోవడంతో ట్రూడో బృందంలోని భద్రతా సిబ్బంది కెనడాలోని అధికార వర్గాలకు సమాచారం అందించాయి. దాంతో, కెనడా నుంచి ఓ ప్రత్యేక విమానంలో టెక్నికల్ టీమ్ ను జమైకాకు పంపించారు. ఆ బృందం విమానానికి మరమ్మతులు చేయడంతో ట్రూడో జనవరి 4న అదే విమానంలో కెనడా చేరుకున్నారు. 

జస్టిన్ ట్రూడో తన ప్రయాణాల కోసం సీసీ-144 చాలెంజర్స్ విమానాన్ని ఉపయోగిస్తుంటారు. ఇది రాయల్ కెనెడియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం.

  • Loading...

More Telugu News