One Nation One Election: ఒకే దేశం-ఒకే ఎన్నిక... ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం పలికిన కోవింద్ కమిటీ
- లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిపేందుకు కేంద్రం యోచన
- అధ్యయనం కోసం రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
- ఇప్పటికే పని ప్రారంభించిన కమిటీ
- ఇటీవల రాజకీయ పక్షాలను, న్యాయ కమిషన్ ను కలిసిన కమిటీ
దేశంలో లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలన్న ఉద్దేశంతో కేంద్రం ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశాన్ని తెరపైకి తెచ్చింది. తద్వారా గణనీయంగా ఖర్చు తగ్గుతుందన్నది కేంద్రం భావన. దీనిపై సమగ్ర అధ్యయనం కోసం భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా నియమించింది.
ఇప్పటికే ఈ కమిటీ పని ప్రారంభించింది. వివిధ వర్గాలను కలుస్తూ అభిప్రాయసేకరణ జరుపుతోంది. రాజకీయ పార్టీలను, న్యాయ కమిషన్ ను కూడా కలిసింది.
తాజాగా, ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం పలికింది. దేశంలో ఒకేసారి పార్లమెంటు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు జరపడంపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోవింద్ కమిటీ పేర్కొంది.
ప్రజలు తమ సూచనలు, సలహాలను onoe.gov.in వెబ్ పోర్టల్ ద్వారా, [email protected] మెయిల్ ఐడీకి ఈ-మెయిల్ చేయడం ద్వారా తెలియజేయవచ్చని కమిటీ వివరించింది. ప్రజలు తమ అభిప్రాయాలను జనవరి 15 లోపు తెలియజేయాలని వెల్లడించింది.
కాగా, దేశంలో 1967 వరకు ఒకే దేశం-ఒకే ఎన్నిక తరహాలో లోక్ సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి.