Revanth Reddy: ఓటుకు నోటు కేసుతో అణచివేయాలని చూస్తే.. ముఖ్యమంత్రిగా ఆయన ముందు నిలబడ్డాను: రాధాకృష్ణతో రేవంత్ రెడ్డి
- తాను ఆసుపత్రిలో బాధ్యతాయుతంగానే కేసీఆర్ను పరామర్శించానన్న రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తాను వంద శాతం నమ్మానని వ్యాఖ్య
- జిల్లాల విభజనపై అందరి అభిప్రాయాలు తీసుకొని.. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం ఉంటుందని స్పష్టీకరణ
ఓటుకు నోటు కేసు ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను ఎన్ని రకాలుగా అణచివేయాలని చూసినా ఈ రోజు ఆయన ముందు ముఖ్యమంత్రిగా నిలబడ్డానని రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాను మాజీ సీఎం కేసీఆర్ను బాధ్యతాయుతంగానే ఆసుపత్రిలో పరామర్శించానని స్పష్టం చేశారు. ఆయనను సవాల్ చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిలా తాను ప్రవర్తించలేదన్నారు. తాను మర్యాదపూర్వకంగానే పరామర్శించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తాను వంద శాతం నమ్మానని తెలిపారు. తాను కేంద్ర పెద్దల వద్దకు ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వెళ్లానని... దీనిని వారు మెచ్చుకున్నారని చెప్పారు.
జిల్లా విభజనపై రేవంత్ రెడ్డి
పాలనలో ఏ క్షణం ఏమరుపాటుగా ఉండవద్దని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. 33 జిల్లాల విభజన సరిగ్గా లేదని విమర్శించారు. జిల్లాల విభజన వల్ల మన శక్తి, సామర్థ్యాలను తగ్గించుకున్నట్లు అయిందన్నారు. ఈ జిల్లాల విభజనపై తన ఇష్టానుసారం చేయలేనని.. అలా చేస్తే విమర్శలు వస్తాయన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిషన్ వేసి విభజన చేస్తే మేలు జరుగుతుందన్నారు. అప్పుడు నచ్చితే నజరానా.. లేదంటే జరిమానా అన్నట్లుగా విభజన జరిగిందన్నారు. అన్ని ప్రాంతాలను పరిశీలించి.. అందరి అభిప్రాయాలను తీసుకొని శాస్త్రీయంగా జిల్లాల విభజన చేయాలన్నారు. ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలో చర్చించాక నిర్ణయం ఉంటుందన్నారు.