Revanth Reddy: ప్రజాపాలన ముగిసినా.. ఆందోళన వద్దు... ఇక నుంచి అక్కడ దరఖాస్తులు ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ పేరుతో అధికారులనే ప్రజల వద్దకు పంపించామని వెల్లడి
- ఇక నుంచి అర్హులు ఎవరైనా కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టీకరణ
- రాజకీయ ప్రస్థానంలో తనకు కుటుంబం మద్దతు ఉందని వెల్లడి
ప్రజాపాలన - అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ఈ రోజుతో ముగిసిందని... కానీ అర్హులు ఎలాంటి ఆందోళన చెందవద్దని... ఇప్పటి వరకు అధికారులు ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరించారని.. ఇప్పుడు ప్రజలు కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వవచ్చునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చెబుతూ.. ప్రజాపాలన ముగిసినప్పటికీ ప్రజలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. 'ఇప్పటి వరకు ప్రజాపాలన పేరుతో అధికారులను మీ వద్దకు పంపించాం.. కానీ ఆందోళన చెందవద్దు.. ఇక నుంచి మీరు కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వవచ్చు' అని తెలిపారు. అర్హులైన వారు ఇక పైనా దరఖాస్తులు చేసుకోవచ్చునని హామీ ఇచ్చారు. వంద రోజుల్లో తాము ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు.
రాజకీయ ప్రస్థానంలో కుటుంబం సహకారం ఉంది
తన రాజకీయ ప్రస్థానంలో తన భార్య, బిడ్డ సహకారం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తన సోదరుల మద్దతు కూడా తనకు పూర్తిస్థాయిలో ఉందని తెలిపారు. తన సోదరులు అధికారులకు ఫోన్లు చేస్తున్నట్లుగా జరిగిన ప్రచారంలో నిజం లేదన్నారు. తన సోదరులు ఏ ఆధికారులకూ ఫోన్లు చేయడం లేదన్నారు. కొంతమంది అధికారులే తన సోదరుల వద్దకు వస్తున్నారని.. అందుకే ప్రజలు మనల్ని గమనిస్తున్నారని హెచ్చరించానని చెప్పారు. తన సోదరులు కూడా అన్నీ ఆలోచించి నడుచుకుంటారని తెలిపారు.