Raghu Rama Krishna Raju: వైసీపీ నుంచి అంబటి రాయుడు బయటపడిన విధానం అద్భుతం: రఘురామకృష్ణరాజు

Raghurama talks about Ambati Rayudu resignation to YSRCP

  • డిసెంబరు 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రాయుడు
  • పది రోజుల్లోనే మనసు మార్చుకున్న వైనం
  • వైసీపీకి రాజీనామా చేస్తున్నానంటూ నేడు ప్రకటన
  • మహనీయుని మనస్తత్వం రాయుడికి ఐదారు రోజుల్లోనే అర్థమైందన్న రఘురామ

ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు పట్టుమని 10 రోజుల్లోనే పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. తాను కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించారు. 

వైసీపీ ఎలాంటిదో తెలుసుకోవడానికి నాకు ఆర్నెల్లు పట్టింది, మిగిలినవారికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది... ఒక్క అంబటి రాయుడికి మాత్రం ఐదారు రోజుల్లోనే అర్థమైందని అన్నారు. ముఖ్యమంత్రి మహనీయుని వ్యక్తిత్వాన్ని, ఆయన దాన గుణాన్ని, ప్రజలను ప్రేమించే విధానాన్ని రాయుడు కనిపెట్టేశాడని వ్యంగ్యం ప్రదర్శించారు. 

కొందరు అనుకోవచ్చు... ఏదో 200 పరుగులు చేస్తాడనుకుంటే బ్యాటింగ్ కే రాకుండా వెళ్లిపోయాడేంటన్న అభిప్రాయాలు రావొచ్చు... హిట్ వికెట్ అయ్యాడేంటి అని మాట్లాడుకోవచ్చు... కానీ రాయుడు సరైన నిర్ణయం తీసుకున్నాడు... మునిగిపోతున్న వైసీపీ నావ నుంచి అరక్షణం ఆలస్యం చేయకుండా బయటికి వచ్చేశాడు అని రఘురామ వివరించారు. 

రాయుడు క్రికెట్ లో వేగంగా బ్యాటింగ్ చేస్తాడని, ఫట్ ఫట్ మని కొట్టేస్తాడని, నిర్ణయాలు తీసుకోవడంలోనూ చాలా ఫాస్ట్ అని రఘురామ పేర్కొన్నారు. తప్పు చేశాంరా బాబూ అని వెంటనే తెలుసుకుని ఇవాళ వైసీపీ నుంచి రాయుడు బయటపడిన తీరు అద్భుతమని పేర్కొన్నారు. 

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు... కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా ట్వీట్లు చేస్తుండడంతో, ఆయన ఆ పార్టీలోనే చేరతారని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే డిసెంబరు 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 

రాయుడికి గుంటూరు లోక్ సభ టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. అసలు, గుంటూరు ఎంపీ టికెట్ ఆశించే రాయుడు వైసీపీలో చేరాడన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. కానీ అంతలోనే రాయుడు మనసు మార్చుకుని వైసీపీకి గుడ్ బై చెప్పేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News