Hanu Man: అంజనీపుత్రుడే చిరంజీవి రూపంలో వచ్చారు: 'హనుమాన్' ఈవెంట్ లో తేజ సజ్జా
- ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'హనుమాన్'
- మెగాస్టార్ తన ఆదర్శమన్న తేజ సజ్జా
- ఆయనకి ఏకలవ్య శిష్యుడినని వ్యాఖ్య
- తనకి లభించే క్రెడిట్ దర్శకుడిదేనని వెల్లడి
- ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న సినిమా
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ 'హనుమాన్' సినిమాను రూపొందించాడు. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై తేజ సజ్జా మాట్లాడుతూ .. "నా వెనుక అంజనీపుత్రుడు ఉన్నారు .. నా ఎదురుగా కూడా అంజనీపుత్రుడు ఉన్నారు. అందువలన మాట్లాడటానికి నాకు కొంచెం టెన్షన్ గా ఉంది" అని అన్నాడు.
"చిరంజీవిగారు సినిమాలలో మాత్రమే ఆపద్బాంధవుడు కాదు .. సినిమా వాళ్లకి కూడా ఆపద్బాంధవుడే. ఎవరైనా గెలిస్తే ముందుగా ఫోన్ చేసి ప్రశంసించేది ఆయనే. ఎవరైనా ఓడిపోతే వెన్నుతట్టేది ఆయనే. నా జీవితంలో మా అమ్మానాన్నల తరువాత నేను రుణపడి ఉండేది చిరంజీవి గారికే. ఆయనను ఆదర్శంగా తీసుకునే ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిని" అని చెప్పాడు.
"నా ఉనికికి .. ఉన్నతకి కారణమైన చిరంజీవిగారికి పాదాభివందనాలు. ఇక మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మగారు నన్ను హీరోను మాత్రమే కాదు .. సూపర్ హీరోను చేశారు. చరణ్ గారికి రాజమౌళి గారు ఎలాగో .. రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు ఎలాగో .. నాకు ప్రశాంత్ వర్మ గారు అలాగే. నాకు లభించిన క్రెడిట్ ఏదైనా ఉంటే అది ఆయనకే చెందుతుంది" అని అన్నాడు.