Prajapalana: ప్రజాపాలనపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- నేటి ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం
- సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రుల హాజరు
- అభయ హస్తం దరఖాస్తుల పరిష్కారం, నిధుల సేకరణపై సమీక్ష
ప్రజాపాలన ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు. అయితే, ఇది అధికారిక మంత్రివర్గ సమావేశం కాదని, అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరినట్టు తెలుస్తోంది.
ప్రజాపాలన సాగిన తీరుపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ప్రజలు ఎక్కువగా ఏ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు? వాటి అమలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తదితరాలపై చర్చించనున్నారు. దరఖాస్తుల డిజిటలీకరణ, ప్రాసెసింగ్‌కు అవసరమైన నిధుల సమీకరణ వంటివాటిపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారిస్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు, ఛత్తీగఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుల్లో అవకతవకలపై న్యాయవిచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంపై కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ నెల రోజుల పాలన, ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రతిదాడికి సంబంధించిన అంశాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకూ ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. మొత్తం 8 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో 1.11 కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. అభయహస్తం గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు, ఇతర అంశాలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు వచ్చాయి.